thula uma: తుల ఉమకు టిక్కెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాక్కోవడం బాధాకరం: బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్
- తుల ఉమ పట్ల ఆ పార్టీ ప్రవర్తించిన తీరు మహిళలు, బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమని విమర్శ
- గతంలోని హోదాకు మించిన స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ
- సొంతింటికి వచ్చినట్లుగా ఉందన్న తుల ఉమ
వేములవాడ అసెంబ్లీ టిక్కెట్‌ను బీజేపీ తుల ఉమకు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కోవడం చాలా బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం తుల ఉమ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తుల ఉమ పట్ల ఆ పార్టీ ప్రవర్తించిన తీరు మహిళలు, బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
గతంలోని హోదాకు మించి ఆమెకు సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె పని చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తుల ఉమకు తాను స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించానన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఆమె పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతి కోసం ఆమె సేవలు అవసరమన్నారు.
అనంతరం తుల ఉమ మాట్లాడుతూ... బీజేపీ తనకు టిక్కెట్ ఇచ్చినట్లే ఇచ్చి దొంగదారిన మరొకరికి ఇచ్చిందన్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేయడం అనేది కల మాత్రమే అన్నారు. అందుకు తానే ఉదాహరణ అని, తనకు చెప్పింది ఒకటి, చేసింది మరొకటి అన్నారు. బీజేపీ కిందిస్థాయి కార్యకర్తలను మాత్రమే వాడుకుంటుందని, బీఆర్ఎస్లో తాను మొదటి నుంచి ఉన్నానని, అనేక హోదాల్లో పని చేశానని చెప్పారు. ఇక్కడ ఇచ్చిన గౌరవం బీజేపీలో దొరకలేదన్నారు. ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు.