Revanth Reddy: రేవంత్ రెడ్డి సభలో వాగ్వాదం... క్షమాపణలు చెప్పిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి
- కాంగ్రెస్ కార్యకర్త ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారని రేవంత్ ప్రచారాన్ని అడ్డుకున్న మహిళ
- ఎవరైనా అలా తిట్టి ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు చెప్పిన గుర్నాథ్ రెడ్డి
- రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతారన్న గుర్నాథ్ రెడ్డి
దౌల్తాబాద్ మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత గుర్నాథ్ రెడ్డి కల్పించుకొని క్షమాపణలు చెప్పడంతో సద్దుమణిగింది.
ఇక్కడకు రేవంత్ రెడ్డి ప్రచారానికి రాకముందు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు, వైస్ ఎంపీపీపై... కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన వైస్ ఎంపీపీ భార్య నిర్మల... రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తుండగా వచ్చి నిరసన తెలిపారు. ఇంతమందిలో ఇష్టారీతిన మాట్లాడారని, ఇది సరికాదని వారు రేవంత్‌తో అన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి జోక్యం చేసుకొని, ఆమెకు సర్ది చెప్పారు. మహిపాల్ రెడ్డిని తిట్టారని ఆమె వచ్చిందని, ఒకవేళ అలా తిడితే కనుక అందరి ఎదుట క్షమించమని మహిపాల్ రెడ్డిని కోరుతున్నానని పేర్కొన్నారు. దయచేసి ఎవరూ అల్లరి చేయవద్దన్నారు. అందరూ రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతారన్నారు.
కృష్ణా జలాలు వచ్చాయా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అయిదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. రెండేళ్లలోనే కృష్ణా జలాలు తెస్తామని, లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు అయ్యాయా? అని ప్రశ్నించారు. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెరిగిన ధరల ప్రకారం రైతులకు రైతు భరోసా రూ.15వేలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.