Janasena: టీడీపీతో నియోజకవర్గ స్థాయి కార్యాచరణకు జనసేన ఇన్చార్జుల నియామకం... ఆమోదం తెలిపిన పవన్ కల్యాణ్
- ఏపీలో జనసేన-టీడీపీ మధ్య పొత్తు
- నియోజకవర్గ స్థాయిలో సమన్వయం కోసం ఇన్చార్జుల నియామకం
- 'పాయింట్ ఆఫ్ కాంటాక్ట్' లుగా నియామకం
జనసేన-టీడీపీ పొత్తు కార్యాచరణలో మరో ముందడుగు పడింది. జనసేన-టీడీపీ మధ్య నియోజకవర్గ స్థాయిలో చేపట్టే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన తరఫున ఇన్చార్జులను నియమించారు. ఈ నియామకాలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు.
ఈ ఇన్చార్జిలను 'పాయింట్ ఆఫ్ కాంటాక్ట్' లుగా పరిగణిస్తారు. టీడీపీతో జనసేన సమావేశాలు, ఇరు పార్టీలు ఉమ్మడిగా నిర్వహించే కార్యక్రమాలను సమన్వయ పరచడం వీరి విధి. రేపటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు.
జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ నిర్ణయించిన అజెండా మేరకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఏంచేయాలన్నది తాజాగా నియమితులైన ఇన్చార్జిలు ఆత్మీయ సమావేశాల్లో వివరించనున్నారు.
ఈ నెల 17 నుంచి నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులోనూ ఇన్చార్జిల పాత్ర ఉంటుంది. ప్రజలను కలిసి భవిష్యత్తుకు గ్యారెంటీపై వివరించడం, ఓటరు జాబితాల పరిశీలన తదితర అంశాలను విజయవంతం చేసేందుకు వీరు కార్యాచరణ రూపొందిస్తారు.