Ross Taylor: టీమిండియాపై మైండ్ గేమ్ షురూ చేసిన న్యూజిలాండ్
- వరల్డ్ కప్ లో ఈ నెల 15న తొలి సెమీఫైనల్
- టీమిండియాతో న్యూజిలాండ్ ఢీ
- న్యూజిలాండ్ ను ఎదుర్కోవడం టీమిండియాను ఒత్తిడికి గురిచేస్తుందన్న రాస్ టేలర్
- గత వరల్డ్ కప్ ను ప్రస్తావించిన కివీస్ మాజీ ఆటగాడు
వరల్డ్ కప్ లో ఈ నెల 15న టీమిండియా, న్యూజిలాండ్ సెమీస్ లో తలపడుతున్నాయి. గత వరల్డ్ కప్ లో టీమిండియా ఓడింది న్యూజిలాండ్ చేతిలోనే. కానీ ఈసారి రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా తన ప్రత్యర్థి న్యూజిలాండ్ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ నాలుగో స్థానంతో సెమీస్ చేరడంలో ఒకరకంగా అదృష్టం కూడా కలిసొచ్చింది.
ఇదిలావుంటే... మరో రెండ్రోజుల్లో సెమీస్ జరగాల్సి ఉండగా... న్యూజిలాండ్ మానసిక యుద్ధానికి తెరలేపింది. సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఎదుర్కోవాల్సి రావడం టీమిండియాను ఒత్తిడికి గురిచేస్తుంటుందని కివీస్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ అన్నాడు.
2019 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా ఇలాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో సెమీస్ చేరిందని, కానీ చివరికి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిందని తెలిపాడు. గత వరల్డ్ కప్ లో కూడా న్యూజిలాండ్ కాస్త కష్టపడి సెమీస్ చేరిందని రాస్ టేలర్ వివరించాడు.
ఈసారి టీమిండియా మరింత పెద్ద ఫేవరెట్ టీమ్ గా బరిలో ఉందని, కాబట్టి టీమిండియాపైనే ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ కు పోయేదేమీ లేదని, న్యూజిలాండ్ ఎప్పుడు ఆడినా, ఎక్కడ ఆడినా ప్రమాదకరమైన జట్టేనని హెచ్చరించాడు. టీమిండియా ఎక్కడైనా ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపించిందంటే అక్కడ న్యూజిలాండ్ జట్టు ఆడుతోందని అర్థం అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
ఇక, సెమీస్ లో న్యూజిలాండ్ ఎలా ఆడాలో కూడా రాస్ టేలర్ చెబుతున్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీస్తే టీమిండియా మిడిలార్డర్ పై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని సెలవిచ్చాడు. మొదటి 10 ఓవర్లలో రెండు మూడు వికెట్లు తీస్తే టీమిండియాను నియంత్రించవచ్చని అన్నాడు. ఎందుకంటే టీమిండియాలో మొదటి ముగ్గురు అద్భుతంగా ఆడుతున్నారని తెలిపాడు.
ఈ మ్యాచ్ లో టాస్ కీలకం అవుతుందని, బ్యాట్ తోనూ, బంతితోనూ శుభారంభం చేస్తే న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సూచించాడు.