Rohit Sharma: గతంలో ఏం జరిగిందనేది అప్రస్తుతం: రోహిత్ శర్మ

Rohit Sharma press meet ahead of semis clash with New Zealand
  • వరల్డ్ కప్ లో రేపు తొలి సెమీఫైనల్
  • టీమిండియా × న్యూజిలాండ్
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
రేపు (నవంబరు 15) న్యూజిలాండ్ తో టీమిండియా వరల్డ్ కప్ సెమీస్ ఆడనుంది. ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఈ సెమీఫైనల్ సమరానికి వేదిక. సొంతగడ్డపై ఆడుతుండడం, తిరుగులేని విజయాలతో సెమీస్ చేరడం వంటి కారణాల రీత్యా టీమిండియానే ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా ఉన్నప్పటికీ, గత వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ చేతిలోనే సెమీస్ మ్యాచ్ ఓడిపోవడం అభిమానుల్లో కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. 

ఈ నేపథ్యంలో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెమీస్ ముంగిట మీడియాతో మాట్లాడాడు. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ పై టీమిండియా ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదన్న విషయంపై స్పందించాడు. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు టీమిండియా, న్యూజిలాండ్ 13 సార్లు తలపడగా... న్యూజిలాండ్ దే పైచేయిగా ఉంది. ఆ జట్టు 9 మ్యాచ్ ల్లో నెగ్గింది. 

అయితే, ఇదేమంత పట్టించుకోవాల్సిన విషయం కాదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. గత వరల్డ్ కప్ లో టీమిండియా... న్యూజిలాండ్ చేతిలో ఓడిందన్న విషయాన్ని మర్చిపోవాలని అన్నాడు. గత ఐదేళ్లలో ఏం జరిగింది? గత పదేళ్లలో ఏం జరిగింది? గత వరల్డ్ కప్ లో ఏం జరిగింది? అనేది అప్రస్తుతం అని స్పష్టం చేశాడు. తమ దృష్టంతా రేపటి మ్యాచ్ పైనే అని వెల్లడించాడు.
Rohit Sharma
Team India
Semifinal
New Zealand
World Cup

More Telugu News