Bandi Sanjay: 70 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పెట్టుబడి: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- కరీంనగర్‌లో చెల్లని రూపాయి పొన్నం ప్రభాకర్ అని చురకలు
- కొంతమంది పోలీసు అధికారులు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారన్న బండి సంజయ్
- బీఆర్ఎస్‌లో నలుగురు ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుతున్నారని వ్యాఖ్య
70 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలకవ్యాఖ్యలు చేశారు. మంగళవారం హుస్నాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొంతమంది పోలీసు అధికారులు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి రూ.లక్ష కోట్ల సంపాదన ఎలా వచ్చింది? అని నిలదీశారు.
కరీంనగర్‌లో చెల్లని రూపాయి పొన్నం ప్రభాకర్ అని ఆయన విమర్శించారు. కరీంనగర్‌లో చెల్లని రూపాయి హుస్నాబాద్‌లో చెల్లుతుందని పొన్నం ప్రభాకర్ ఇక్కడకు వచ్చాడా? అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తే బీఆర్ఎస్‌లో నలుగురు ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుతారన్నారు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులేనని ఎద్దేవా చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై లాఠీచార్జి చేస్తే అర్ధరాత్రి ఢిల్లీ నుంచి వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించి అండగా నిలిచానన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ కేసీఆర్‌తో మాట్లాడి హుస్నాబాద్‌కు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలన్నారు.
కొంతమంది పోలీసు అధికారులు ప్రమోషన్ల కోసం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారన్నారు. రూ.30 వేల కోట్లతో అయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష 30 వేల కోట్లకు పెంచి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఎవరైనా నిరుద్యోగుల కోసం పోరాడి జైలుకు పోయారా? అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ఎప్పుడైనా జైలుకెళ్లాడా? లాఠీ దెబ్బలు తిన్నాడా? అని నిలదీశారు. కానీ తాను లాఠీ దెబ్బలు తిన్నానని, జైలుకు వెళ్లానని చెప్పారు. తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.