Priyanka Gandhi: ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
- ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసత్య ప్రకటన చేస్తున్నారంటూ బీజేపీ ఫిర్యాదు
- ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణపై వ్యాఖ్యలకు సంబంధించి ప్రియాంకకు నోటీసులు
- సోషల్ మీడియాలో ఆప్ అనైతిక వీడియో క్లిప్స్ పోస్ట్ చేస్తోందని ఆప్‌కి షోకాజ్
- గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు, అసత్య వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కూడా ఇదే తరహా నోటీసులు జారీ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఈ విధంగా స్పందించింది. తన వ్యాఖ్యలపై గురువారం రాత్రి 8 గంటలల్లోగా వివరణ ఇవ్వాలని ప్రియాంక గాంధీని ఈసీ కోరింది.
కాగా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రియాంక గాంధీ అసత్య వ్యాఖ్యలు చేశారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 10న ఫిర్యాదు చేసింది. మరోవైపు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై గురువారంలోగా జవాబివ్వాలని అరవింద్ కేజ్రీవాల్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ఆప్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాని, అనైతిక వీడియో క్లిప్‌లను పోస్ట్ చేశారని బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.