Cricket world cup: న్యూజిలాండ్ జట్టుకు ఇంగ్లాండ్ లెజెండ్ మెచ్చుకోలు
- ఇండియాకు తలవంచని జట్టేదైనా ఉందంటే అది న్యూజిలాండే అన్న నాసర్ హుస్సేన్
- ఈ మెగా టోర్నీలో ఇండియానే ఫేవరెట్ అంటున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
- వాంఖడేలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
ప్రపంచకప్ మెగా టోర్నీలో ఈసారి భారత జట్టే ఫేవరేట్ అని ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్, ఇండియాలు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాటిలో ఏ జట్టు గెలుస్తుందని అడిగిన విలేకరులకు ఆయన ఇండియానే ఫేవరెట్ అంటూ జవాబిచ్చాడు. అయితే, భారత జట్టుకు తలవంచని జట్టేదైనా ఉందంటే అది న్యూజిలాండేనని మెచ్చుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కోహ్లీ బ్యాటింగ్ కు వస్తుంటే స్టేడియంలోని అభిమానుల సంతోషం పీక్ స్టేజికి వెళుతుందని హుస్సేన్ అన్నారు.
న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదని హుస్సేన్ అన్నారు. సొంతగడ్డపై ఆడడం, లీగ్ దశలో వరుస విజయాలు సాధించడం భారత జట్టుకు కలిసొచ్చే అంశాలైతే.. లీగ్ మ్యాచ్ లో తమను ఓడించిన జట్టుపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం న్యూజిలాండ్ ఆటగాళ్లకు వచ్చిందని తెలిపారు. ఆ జట్టులో రచిన్ రవీంద్ర వంటి మంచి ఆటగాళ్లు ఉన్నారని హుస్సేన్ పేర్కొన్నారు.