Andhra Pradesh: పల్నాడు ప్రజల నీటి కష్టాలను తీర్చేస్తాం: వైఎస్ జగన్

Andhra Pradesh CM Jagan Live From Macharla

  • తాగు, సాగు నీటిని అందించేందుకే వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు
  • 24 వేల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ఏర్పాట్లు
  • 20 వేల జనాభాకు తాగు నీరు అందుతుందన్న సీఎం జగన్
  • ఏపీలో పూర్తిగా పైప్ లైన్ ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు ఇదేనని వెల్లడి
  • మాచర్ల నియోజకవర్గంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన

పల్నాడు ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకరినని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణమ్మ ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకు కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ క్రమంలో పల్నాడుకు వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం ఎంతుందనేది తెలిసిన అతికొద్దిమందిలో తానొకడినని చెప్పారు. దశాబ్దాలుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు గత పాలకులు ఈ ప్రాజెక్టుకు హడావుడిగా శంకుస్థాపన చేశారని జగన్ గుర్తుచేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, భూ సేకరణ చేపట్టకుండానే టెంకాయ కొట్టి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు కోసం పట్టుదలగా ప్రయత్నాలు చేపట్టామని, ఈ నెల 6న అటవీ శాఖ అనుమతులు రావడంతో ప్రస్తుతం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని వివరించారు. ఈమేరకు మాచర్ల పట్టణంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.

వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పల్నాడు ప్రజల తాగు, సాగు నీటి కష్టాలను దూరం చేసేందుకే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని చెప్పారు. దశల వారీగా మాచర్ల నియోజకవర్గం, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు విస్తరిస్తూ ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు.

పనులన్నీ పూర్తయి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. ప్రారంభ దశలలో వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుతో 25 వేల ఎకరాలకు సాగు నీరు, 20 వేల మందికి తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఏపీలో పూర్తిగా పైప్ లైన్ ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు ఇదేనని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.


  • Loading...

More Telugu News