Virat Kohli: కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు.. నేటి మ్యాచ్‌లో ఎన్ని సాధిస్తాడో?

Virat Eyes On Sachin Tendulkar 3 Records

  • ఆ మూడు రికార్డులూ సచిన్‌వే
  • సెంచరీ చేస్తే వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు
  • 80 పరుగులు చేస్తే ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగుల రికార్డు
  • హాఫ్ సెంచరీ సాధిస్తే ప్రపంచకప్‌లో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డు

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ దూకుడుమీదున్నాడు. బ్యాటింగ్‌లో చెలరేగిపోతున్న విరాట్ ప్రత్యర్థులకు నిద్రను దూరం చేస్తూ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడతడిని మరో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ మూడూ సచిన్ టెండూల్కర్‌వే కావడం గమనార్హం. 

లీగ్ దశలో కోహ్లీ ఇప్పటి వరకు జరిగిన 9 మ్యాచుల్లో 99 సగటుతో 594 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. నేడు కివీస్‌తో జరగనున్న సెమీస్‌ మ్యాచ్‌లో విరాట్ మరొక్క సెంచరీ సాధిస్తే ‘శతకాల్లో ఫిఫ్టీ’ వీరుడిగా సరికొత్త ప్రపంచ రికార్డు అందుకుంటాడు. ఈ క్రమంలో సచిన్ 49 వన్డే సెంచరీ రికార్డు బద్దలవుతుంది. 

రెండో రికార్డు విషయానికి వస్తే.. సచిన్ 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులు సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 594 పరుగుల ఉన్నాయి. అంటే మరో 80 పరుగులు చేస్తే ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. అయితే, ఈ విషయంలో డికాక్, రచిన్ రవీంద్ర నుంచి కూడా పోటీ ఎదురుకానుంది. 

ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ ఇప్పటి వరకు ఏడుసార్లు 50కిపైగా స్కోర్లు సాధించాడు. నేటి మ్యాచ్‌లో మరో అర్ధ సెంచరీ సాధిస్తే సచిన్ (7), షకీబల్ హసన్ (7) రికార్డు బద్దలవుతుంది. ఊరిస్తున్న ఈ మూడు రికార్డుల్లో కోహ్లీ ఎన్నింటిని సాధిస్తాడో చూడాలి.

  • Loading...

More Telugu News