Rohit Sharma: వరల్డ్ కప్ సెమీస్... రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్!
- న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ రోహిత్
- 29 బంతుల్లో 47 పరుగులు చేసి ఔట్
- వరల్డ్ కప్ లలో అత్యధిక సిక్సులు బాదిన బ్యాట్స్ మెన్ గా ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్స్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ మరోసారి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 47 పరుగులు చేసి వెనుదిరిగాడు. సౌథీ బౌలింగ్ లో భారీ షాట్ కు రోహిత్ ప్రయత్నించాడు. అయితే వెనక్కి పరిగెత్తుతూ కెప్టెన్ విలియంసన్ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. రోహిత్ హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికీ... అద్భుతమైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. 50 సిక్సర్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (49), ఏబీ డీవిలియర్స్ (37), రిక్కీ పాంటింగ్ (31), బ్రెండన్ మెక్ కల్లమ్ (29) ఉన్నారు.