Revanth Reddy: కాంగ్రెస్‌ను గెలిపించండి... నేను ఈ జిల్లాను దత్తత తీసుకుంటా: అదిలాబాద్ లో రేవంత్ రెడ్డి
- రాజకీయంగా పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారన్న టీపీసీసీ చీఫ్
- తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదన్న రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టీకరణ
రాజకీయంగా తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అదిలాబాద్ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతామన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కూడా కేసీఆర్ పరామర్శించలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 31వ తేదీలోపు బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేసే బాధ్యతను తీసుకుంటానన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ ప్రకటించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400గా ఉండేదని, ఇప్పుడు రూ.1000కి పెరిగిందన్నారు. బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. అదిలాబాద్ జిల్లాను తాను దత్తత తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు.