Revanth Reddy: సమస్యలపై నిలదీసే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కాకుండా... బానిసలా ఉండే పల్లా ఎమ్మెల్యే కావాలన్నది కేసీఆర్ కోరిక: రేవంత్ రెడ్డి
- పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందన్న రేవంత్ రెడ్డి
- జనగామ నుంచి కట్టు బానిసలా ఉండే పల్లాను గెలిపించుకోవాలనుకుంటున్నారని వ్యాఖ్య
- పల్లా గురించి నేను చెప్పడం కాదు... ముత్తిరెడ్డే చెప్పారన్న రేవంత్ రెడ్డి
జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తే రెవెన్యూ డివిజన్ చేస్తామని, ఈ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జనగామలో నిర్వహించిన విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జనగామ గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్నారు. తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో జనగామ ప్రజలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని, ఆయనను 47 ఏళ్లు పార్టీ మోసిందని, కానీ చివరకు మోసం చేశారన్నారు. జనగామ నుంచి తనకు కట్టుబానిసలా ఉండే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని, కానీ ప్రజా సమస్యలపై పోరాడే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అక్కడి నుంచి గెలవవద్దని కేసీఆర్ చెబుతున్నారన్నారు.
జనగామ పౌరుషంతో కూడిన ప్రాంతమని, సర్దార్ పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ వంటి వారితో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని, పల్లా రాజేశ్వర్ రెడ్డే చెప్పారన్నారు. ముత్తిరెడ్డి గురించి ఆయన కూతురు కూడా చెప్పిందన్నారు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించేమో ముత్తిరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో చెప్పారన్నారు. పసుపు, కుంకుమ కింద సొంత సోదరికి ఇచ్చిన ఆస్తులను కబ్జా పెట్టిన వ్యక్తి పల్లా అని, ఇంతకుమించిన పాపాత్ముడు లేడని, కాబట్టి ఇలాంటి వ్యక్తిని జనగామలో కాలు పెట్టనీయవద్దని చెప్పారని గుర్తు చేశారు. ముత్తిరెడ్డి, పల్లాల బాగోతం ఒకరికొకరు తెలుసునని, గడీలో ఉన్న దొర కేసీఆర్ కు కూడా తెలుసునన్నారు.
దొరల గడీలో బానిసలా ఉండే పల్లాను గెలిపిస్తారా? 2014 వరకు సమైక్య రాష్ట్రం కోసం.. సమైక్య పాలన కోసం పాలకుల చేతిలో కీలుబొమ్మగా ఉన్న పల్లా గెలవాలా? లేక తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామా చేసిన కొమ్మూరి కావాలా? జనగామ ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశమంతా ఎదురు చూస్తోందన్నారు. ఈ తీర్పు దేశ రాజకీయాల్లో పెను తుపాను సృష్టించనుందన్నారు. మొన్న హిమాచల్ ప్రదేశ్, నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ.. రేపు ఢిల్లీ ఎర్రకోటపై జెండా ఎగురవేయబోతున్నామన్నారు.