Vijayashanti: తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించబోరు: విజయశాంతి

as TDP is far away from Telangana elections BRS will away from AP politics says Vijayashanti

  • తెలంగాణలో సెటిలర్స్ అనే భావనలేదని వ్యాఖ్య
  • ప్రాంతేతర పార్టీలు, ప్రజలను ఒకే మాదిరిగా లెక్కగట్టకూడదని అభిప్రాయం
  • ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించిన విజయశాంతి

ప్రాంతేతర పార్టీలను, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే విధంగా లెక్కగట్టడం ఎంతమాత్రం సరికాదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ అంశం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కూడా అవగతమవ్వడంతో తెలంగాణ ఎన్నికలకు దూరమైనట్లు తెలుస్తోందని ఆమె చెప్పారు. టీడీపీ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కూడా దూరం ఉన్నట్లు తెలుస్తున్నది వాస్తవమని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’ వేదికగా ఆమె స్పందించారు.

తెలంగాణలో సెటిలర్స్ అనే భావన లేదని, రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలేనని బీజేపీ సీనియర్ నేత, సినీనటి విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో సెటిలర్ల ప్రయోజనాలు, భద్రత కాపాడాలన్న విధానాన్ని  కచ్చితంగా సమర్ధించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే తరతరాలు పోరాడిన తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించబోరని వ్యాఖ్యానించారు. ఈ విషయం ఇప్పటికే నిరూపితమైన వాస్తవమని అన్నారు.

పార్టీల ప్రయోజనాలు వేరు, ప్రజా ప్రయోజనాలు వేరని విజయశాంతి అన్నారు. ఏ ప్రాంతం వారైనప్పటికీ భారత జాతిగా, వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు నిలబడేలా ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటం సమాఖ్య వ్యవస్థలో అందరి విధి అని విజయశాంతి పేర్కొన్నారు. అందుకే కరోనా కష్టకాలంలో ప్రాణాపాయస్థితిలో హైదరాబాద్ హాస్పిటల్స్‌కు రాకుండా ఆంధ్ర ప్రజలను సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకున్నప్పుడు తాను స్పందించానని అన్నారు. రోగులను హైదరాబాద్‌కు అనుమతించకపోతే ఎంతటి కొట్లాటకైనా సిద్ధపడతానని తాను చెప్పింది ఇప్పటికీ అందరికీ జ్ఞాపకమేనని రాములమ్మ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News