Bandi Sanjay: రజాకార్ల పాలనను భూస్థాపితం చేస్తేనే.. రామరాజ్యం వస్తుంది: బండి సంజయ్
- రంగురంగుల జెండాలను పక్కన పెట్టి కాషాయజెండాతో పచ్చజెండా రాజ్యాన్ని భూస్థాపితం చేద్దామన్న బండి సంజయ్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు ఖాయమన్న కరీంనగర్ ఎంపీ
- సుస్థిర పాలన కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని పిలుపు
రంగురంగుల జెండాలను పక్కన పెట్టి, చేతిలో కాషాయజెండా పట్టుకొని, తెలంగాణలో ఈ రజాకార్ల పాలనను, పచ్చజెండా రాజ్యాన్ని భూస్థాపితం చేద్దామని, అప్పుడే రామరాజ్యం వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విజయ శంఖారావం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా పత్లాపూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం బిచ్కుంద బస్‌స్టాండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు ఖాయమన్నారు. గెలిచిన తర్వాత తాము అమ్ముడుపోమని కాంగ్రెస్ నేతలు గ్యారంటీ ఇస్తారా? అని ప్రశ్నించారు. సుస్థిర ప్రభుత్వం కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని పిలుపునిచ్చారు. అందుకు ప్రజలంతా ఏకం కావాలన్నారు. తాను ఆవేశంతో మాట్లాడటం లేదని, ఈ రాజకీయ పార్టీల తీరు చూసి తనకు బాధ వేస్తోందని, ఆవేదనతో మాట్లాడుతున్నానన్నారు.