Indian Railways: రైల్వే భారీ విస్తరణ కార్యక్రమం.. 2027 కల్లా అందరికీ కన్ఫర్మ్డ్ టిక్కెట్స్

Indian railways big expansion plans to meet demand

  • పండగ సీజన్లలో రద్దీ తట్టుకునేలా విస్తరణ కార్యక్రమం
  • వచ్చే నాలుగేళ్లలో 3 వేల కొత్త రైళ్లు సిద్ధం
  • ఏటా 5 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌ల ఏర్పాటు
  • ఏటా ప్రయాణించే వారి సంఖ్య వెయ్యి కోట్లకు చేర్చేందుకు ప్రణాళికలు

ప్రయాణికుల అవసరాలకు తగినట్టుగా రైల్వే విభాగం భారీ విస్తరణ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ప్రతి రోజూ కొత్త రైళ్లు జోడించడంతో పాటూ 2027 కల్లా అందరికీ కన్ఫర్మ్డ్ టిక్కెట్స్ లభించేలా ప్రణాళికలు రూపొందించుకుంది. రద్దీగా ఉన్న రైలు ఎక్కే ప్రయత్నంలో ఇటీవల ఓ బీహార్ వ్యక్తి మరణించడంపై కలకలం రేగుతున్న నేపథ్యంలో రైల్వే వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం ప్రతి రోజూ దేశంలో 10,748 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ సంఖ్యను 13 వేలకు రైల్వే పెంచనుంది. ఏటా 5 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు అందుబాటులోకి తేవడంతో పాటూ వచ్చే నాలుగేళ్లలో 3 వేల కొత్త రైళ్లను సిద్ధం చేయనున్నారు. ప్రస్తుతం ఏటా 800 కోట్ల మంది రైళ్లల్లో ప్రయాణిస్తుండగా ఈ సంఖ్యను వెయ్యి కోట్లకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ప్రయాణ సమయం తగ్గించడంపై కూడా రైల్వే దృష్టిపెట్టింది. రైళ్లు బయలుదేరే, ఆగే సమయాల్లో సమర్థవంతమైన వేగ నియంత్రణ, అదనపు రైల్వే ట్రాక్స్ జోడింపు వంటి వ్యూహాలతో ప్రయాణ సమయం తగ్గుతుందని చెబుతోంది. వేగం నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టింది. ఈ దిశగా చర్యలు సఫలమైతే ఢిల్లీ-కోల్‌కతా మధ్య ప్రయాణం 20 నిమిషాల నుంచి రెండు గంటల వరకూ తగ్గుతుందని చెబుతోంది. పుష్, పుల్ టెక్నిక్‌తో రైలు వేగం నియంత్రణ మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొంది. 

ప్రస్తుతం దేశంలో ఏటా 225 పుష్, పుల్ టెక్నాలజీ ట్రెయిన్లు తయారవుతున్నాయి. ఇక అత్యాధునిక వందే భారత్ రైళ్లలో వేగ నియంత్రణ సామర్థ్యం సాధారణ రైళ్లతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.

  • Loading...

More Telugu News