Horse: కార్గో విమానంలో బోను నుంచి తప్పించుకున్న గుర్రం.. హడలిపోయిన సిబ్బంది
- న్యూయార్క్ నుంచి బెల్జియంకు బయలుదేరిన విమానం
- వెనక్కి మళ్లించి తిరిగి న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్
- విమానం బరువు ఎక్కువగా ఉండడంతో 20 టన్నుల ఇంధనం సముద్రంపాలు
కార్గో విమానంలో తరలిస్తున్న ఓ గుర్రం బోను నుంచి తప్పించుకుని విమానంలో అటూఇటూ తిరగడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్ అట్లాంటా ఐస్లాండిక్ విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుచూసింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బెల్జియంకు ఇటీవల బోయింగ్ 747 కార్గో విమానం బయలుదేరింది. అందులో గుర్రాన్ని తరలిస్తుండగా విమానం బయలుదేరిన అరగంట తర్వాత బోను లోంచి తప్పించుకున్న గుర్రం బయటకు వచ్చి అటూఇటూ తిరిగింది.
గుర్రం ఒక్కసారిగా బోను నుంచి దూకడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే విషయాన్ని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి న్యూయార్క్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కాగా, విమానం వెనక్కి వస్తున్న సమయంలో బరువు ఎక్కువగా ఉన్న కారణంగా 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ మహా సముద్రంలో పారబోసినట్టు సిబ్బంది తెలిపారు.