Umpires: టీమిండియా-ఆసీస్ వరల్డ్ కప్ ఫైనల్ కు అంపైర్లు వీరే!
- ముగింపు దశకు ఐసీసీ వరల్డ్ కప్
- ఈ నెల 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్
- టైటిల్ పోరులో తలపడనున్న టీమిండియా-ఆస్ట్రేలియా
భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ టైటిల్ సమరంలో విధులు నిర్వహించే అంపైర్లను ఐసీసీ తాజాగా ప్రకటించింది. మైదానంలో అంపైర్లుగా రిచర్డ్ కెటిల్ బరో, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ వ్యవహరిస్తారు. జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్ గా విధులు నిర్వర్తించనున్నారు. ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.
50 ఏళ్ల రిచర్డ్ కెటిల్ బరో ఇంగ్లండ్ కు చెందిన వ్యక్తి. ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత అంపైరింగ్ కెరీర్ ను ఎంచుకున్నాడు. అంపైరింగ్ లో వివాదరహితుడిగా పేరుపొందాడు. ఇప్పటివరకు 112 టెస్టులు, 159 వన్డేలు, 51 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో అంపైరింగ్ విధులు నిర్వర్తించాడు.
మరో అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ కూడా బ్రిటన్ కు చెందినవాడే. ఇంగ్లండ్ తరఫున జాతీయ జట్టుకు కూడా ఆడాడు. ప్రధానంగా లెఫ్టార్మ్ స్పిన్నర్. క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాక అంపైరింగ్ వైపు అడుగులు వేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 92 టెస్టులు, 159 వన్డేలు, 40 అంతర్జాతీయ టీ20 పోటీల్లో అంపైర్ గా వ్యవహరించాడు.