World Cup: వరల్డ్ కప్ ఫైనల్ ముందు జరిగే కార్యక్రమాలు ఇవే!

BCCI set to organise some programs before starting of World Cup final
  • ఈ నెల 19న వరల్డ్ కప్ ఫైనల్
  • టీమిండియా × ఆస్ట్రేలియా
  • అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్
  • మ్యాచ్ కు ముందు వాయుసేన విమానాల విన్యాసాలు
  • వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకు సత్కారం
  • గాయకుడు ప్రీతమ్ సంగీత కచేరీ
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ చేరడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు. ఈ నెల 19న జరిగే ఫైనల్ సమరంలో భారత జట్టు ఆసీస్ ను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ ను ముద్దాడాలని యావత్ భారతీయులు కోరుకుంటున్నారు. 

కాగా, రెండు అగ్రశ్రేణి జట్లు తలపడుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ టైటిల్ పోరును చిరస్మరణీయంగా మలిచేందుకు బీసీసీఐ తన వంతు కృషి చేస్తోంది. అందుకోసం, ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ వైమానిక విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అనంతరం, ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలిచిన వివిధ జట్ల సారథులను సత్కరించనున్నారు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకు బీసీసీఐ ప్రముఖులు ప్రత్యేక బ్లేజర్లను బహూకరించనున్నారు. తర్వాత గాయకుడు ప్రీతమ్ సంగీత కచేరీ ఉంటుంది. 

ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతుండడం విశేషం. టోర్నీ విజేతలకు ఆయనే కప్ అందించనున్నారు. 

ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ పాప్ గాయని దువా లిపా కచేరీ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో, ఇదంతా వట్టి ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది.
World Cup
Final
Ahmedabad
BCCI
Team India
Australia

More Telugu News