Prakash Javadekar: బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి మీద కచ్చితంగా విచారణ... వెనక్కి తగ్గేదిలేదు: ప్రకాశ్ జవదేకర్

Will investigate about dharani scam says prakash javadekar
  • కాళేశ్వరం కంటే ధరణి అతిపెద్ద స్కాం అన్న ప్రకాశ్ జవదేకర్
  • ధరణి పోర్టల్ నిర్వహణను ప్రయివేటు కంపెనీకి ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్న
  • కాళేశ్వరం, ధరణి... రెండు కుంభకోణాలే అన్న ప్రకాశ్ జవదేకర్
బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ద్వారా జరిగిన కుంభకోణంపై పూర్తిగా విచారణ జరుపుతామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ధరణి పోర్టల్ అతిపెద్ద స్కామ్ అన్నారు. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. ధరణి పోర్టల్ నిర్వహణను ప్రయివేటు కంపెనీకి ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ నిర్వహణను ముందుగా టీసీఎస్‌కు అప్పగించారని, ఆ తర్వాత ఐఎల్ఎఫ్‌ఎస్‌కు ఇచ్చారని, చివరకు టెర్రాస్ సీఐఎస్‌కు ఇచ్చారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ధరణి కుంభకోణం పెద్దదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద మోసం ఇది అన్నారు. లక్షల మంది సాధారణ రైతులు దీని కారణంగా భూములు కోల్పోయారన్నారు. కానీ ధరణి సర్వరోగ నివారిణి అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. గ్రామాలలో రెవెన్యూ రికార్డులు నిర్వహించాల్సిన వీఆర్వో వ్యవస్థ లేకుండా చేయడం ద్వారా గ్రామాల్లోని భూరికార్డులను ప్రభుత్వం తీసుకొని ఎవరికీ ఈ రికార్డులు అందకుండా చేసిందన్నారు. 

ధరణి రికార్డులను మార్చేసి పట్టేదార్, పొసెషన్‌ల స్థానంలో బినామీ, అక్రమంగా చొరబాటుదారు అని పేర్లు చేర్చారని మండిపడ్డారు. కేంద్రం, ఎన్ఐసీ రూపొందించిన సాఫ్టువేర్ అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ భూరికార్డులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాడిఫై చేసుకునే వెసులుబాటు ఇచ్చిందన్నారు. తొలుత ఈ రికార్డులను ఆధునికీకరించే ప్రక్రియను టీసీఎస్‌కు అప్పగించిందని, మూడు నెలలకే ఒత్తిడి కారణంగా ఆ కంపెనీ తప్పుకుందన్నారు. ప్రభుత్వం కోరినట్లుగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేక తప్పుకుందన్నారు.

చివరకు టెర్రా సీఐఎస్ చేతికి వచ్చిందని, కానీ ఈ కంపెనీ మనుగడే ప్రశ్నార్థకంగా ఉందన్నారు. వివిధ రకాల భూముల విషయంలో అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కీలక డేటాను ఓ ప్రయివేటు కంపెనీ లోతుగా పరిశీలించిందన్నారు. తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపి, భూయజమానులకు న్యాయం చేస్తామన్నారు. ధరణి మీద విచారణ జరుపుతామని వెనక్కి తగ్గేది లేదన్నారు. కాళేశ్వరం, ధరణి రెండు కుంభకోణాలే అన్నారు. బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Prakash Javadekar
Telangana Assembly Election
BJP
KCR

More Telugu News