Amit Shah: అమిత్ షా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టో వివరాలివిగో

Amit Shah releases bjp manifesto today
  • సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల 
  • ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన
  • రైతే రాజు... అందరికీ ఆహార భద్రత... నారీ శక్తి సహా పలు అంశాలు
  • సరికొత్త విద్యాశ్రీ, వైద్యశ్రీ
  • అధికారికంగా తెలంగాణ విమోచన దినం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియా టవర్స్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సకల జనుల సౌభాగ్య పేరుతో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు బాగా అమలవుతాయన్నారు. గతంలో వాజ్‌పేయి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాలకు మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేటాయించామన్నారు.

10 అంశాలు కలిగిన... సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు... 

1. ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన
- అవినీతిని ఉక్కుపాదంతో అణచివేయడం - ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో సుపరిపాలన
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించి పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు
- ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థను తీసుకు వస్తాం
- కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
- తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు
2. వెనుకబడిన వర్గాల సాధికారత - అందరికీ సమానంగా చట్టం వర్తింపు
3. కూడు, గుడు - ఆహార భద్రత, నివాసం
4. రైతే రాజు - అన్నదాతలకు అందలం. విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్‌పుట్ అసిస్టెన్స్
5. నారీ శక్తి - మహిళల నేతృత్వంలో అభివృద్ధి. మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్. మహిళలకు 10 లక్షల వరకు ఉద్యోగాలు
6. యువ శక్తి - యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, గ్రూప్ 2 నిర్వహణ. ఈడబ్ల్యుఎస్ కోటాతో సహా అన్ని నియామకాలు ఆరు నెలల్లో పూర్తి.
7. విద్యాశ్రీ - నాణ్యమైన విద్య. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు అన్ని ప్రయివేటు స్కూళ్ళలో ఫీజుల విధానంపై పర్యవేక్షణ. 
8. వైద్యశ్రీ - నాణ్యమైన వైద్య సంరక్షణ. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రయివేటు ఆసుపత్రిల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం. జిల్లాస్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రోత్సాహం.
9. సమ్మిళిత అభివృద్ధి - పరిశ్రమలు, మౌలికవసతులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రీయింబర్సుమెంట్స్.
10. వారసత్వం - సంస్కృతి, చరిత్ర. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినం. జాతీయస్థాయిలో సమ్మక్క - సారక్క జాతర ఉత్సవాలు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర. ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు. బైరాన్ పల్లి, పరకాల ఊచకోతలను స్మరించుకుంటూ అగస్ట్ 27న రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం.
- బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేయడం 
- ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం 
Amit Shah
BJP
manifesto
Telangana Assembly Election

More Telugu News