KTR: ప్రియాంకగాంధీ 'ముఖ్యమంత్రి ఫేస్' లాజిక్పై నెటిజన్ అదిరిపోయే కౌంటర్... కేటీఆర్ రీట్వీట్
- రాజస్థాన్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని, అలాంటి పార్టీని పక్కన పెట్టాలన్న ప్రియాంకగాంధీ
- తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ను అదే అడుగుతున్నారంటూ నెటిజన్ పోస్ట్
- సీఎం ఫేస్ లేని పార్టీకి ఓటు వేయవద్దు కదా.... అంటూ చురకలు
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ప్రియాంకగాంధీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని, అలా ప్రకటించని ఆ పార్టీని పక్కన పెట్టాలని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ సూచించారు. రాజస్థాన్లో సీఎం ఫేస్ లేకుండానే బీజేపీ ఎన్నికలకు వెళుతోందని... అసలు మీ ముఖ్యమంత్రి ఎవరు? అని మీ వద్దకు వచ్చిన బీజేపీ నేతలను అడగండి... అప్పుడు వారి వద్ద సమాధానం ఉండదు.. అని సభికులను ఉద్దేశించి ఆమె అన్నారు.
ప్రియాంకగాంధీ చేసిన ఈ ప్రసంగ వీడియోను నాయిని అనురాగ్ రెడ్డి అనే నెటిజన్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన వ్యాఖ్యలను పేర్కొంటూ... ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ను అడుగుతున్నారని చురకలు అంటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం ఫేస్ ఎవరు?... ప్రియాంక గారూ... మీ లాజిక్ ప్రకారం సీఎం ఫేస్ లేని పార్టీకి ఓటు వేయవద్దు కదా.. అని కౌంటర్ ఇచ్చారు. నాయిని అనురాగ్ రెడ్డి పోస్టును కేటీఆర్ రీట్వీట్ చేశారు.