Revanth Reddy: హైకమాండ్ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ వెళ్లి టీడీపీని ఓడించేందుకు ప్రచారం చేస్తా: రేవంత్ రెడ్డి
- చంద్రబాబును కలిసినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న రేవంత్ రెడ్డి
- చంద్రబాబు తన రాజకీయ గురువు అని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టీకరణ
- తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి
- అసదుద్దీన్ బీజేపీ గెలుపు కోసం పని చేస్తున్నారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని ఓడించాలని పార్టీ అధిష్ఠానం తనను ఆదేశిస్తే తాను అక్కడకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సాక్షి ఛానల్ నిర్వహించిన బిగ్ క్వశ్చన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాను చంద్రబాబును కలిసినట్లుగా ప్రచారం జరిగిందని, కానీ అందులో వాస్తవం లేదన్నారు. తమకు టీడీపీతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. చంద్రబాబు తనకు రాజకీయ గురువు అని తాను ఎక్కడా చెప్పలేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తనకు గురువులు అంటూ ఎవరూ లేరన్నారు. నాకు నేనే గురువును... నాకు నేనే శిష్యుడిని అన్నారు. తమ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు. అవి ఆయన వ్యక్తిగతం అన్నారు.
తాము పక్క రాష్ట్రాలతో ఆరోగ్యకర సంబంధాలనే కోరుకుంటున్నామన్నారు. అసదుద్దీన్ ఓవైసీ తనపై చేసిన విమర్శలలో వాస్తవం లేదన్నారు. అసలు ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తోన్న అసదుద్దీన్ గోషామహల్లో రాజాసింగ్‌పై ఎందుకు పోటీ చేయడం లేదు? అని ప్రశ్నించారు. దీనిని బట్టే అసదుద్దీన్ బీజేపీ గెలుపు కోసం వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎంపీకీ అసదుద్దీన్ వాహనం సమకూర్చారని, ఆయనకు విందు ఇచ్చారని ఆరోపించారు. అసదుద్దీన్ షేర్వానీ కింద పైజామా లేదని, నిక్కర్ ఉందని ఎద్దేవా చేశారు.