Team India: ఫైనల్లో ఓటమి అనంతరం రోహిత్ శర్మ ఏమన్నాడంటే...!
- ఫైనల్లో స్థాయికి తగ్గట్టు రాణించలేదని కెప్టెన్ వ్యాఖ్య
- మ్యాచ్‌లో ప్రతీది ప్రయత్నించినా నిరాశే ఎదురైందన్న రోహిత్
- మెరుగైన జట్టు చేతిలో ఓడిపోయామని వివరణ
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మెరుగైన జట్టు చేతిలో ఓడిపోయామని ఓటమిని అంగీకరించాడు. మ్యాచ్ ఫలితం టీమిండియాకు అనుకూలంగా రాలేదని, ఫైనల్లో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో తాము ప్రతీది ప్రయత్నించి చూశామని, కానీ ఫలితం దక్కలేదని చెప్పాడు మరో 20-30 పరుగులు చేసి ఉంటే బావుందని అన్నాడు. కేఎల్ రాహుల్, కోహ్లీ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని, స్కోరు బోర్డు 270 -280 వరకు ఉండాలని అనుకున్నాం, కానీ వికెట్లు క్రమంగా కోల్పోతూ ఉండడంతో అనుకున్న స్కోరు సాధించలేకపోయామని రోహిత్ వివరించాడు.
ఇక 240 పరుగుల స్కోరును కాపాడుకుందామని ప్రయత్నించినప్పటికీ వికెట్లు తీయడంలో విఫలమయ్యామని రోహిత్ చెప్పాడు. ట్రావిస్ హెడ్, లబూషేన్ తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారని రోహిత్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందనే సాకులు చెప్పదలుచుకోలేదని పేర్కొన్నాడు. తాము తగినన్ని పరుగులు చేయలేదని, ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా కుర్రాళ్లు అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారని రోహిత్ ప్రశంసించాడు.