Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు

AP High Court granted bail to Chandrababu in skill case
  • టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట
  • సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనలను కొట్టిపారేసిన హైకోర్టు
  • చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ టి.మల్లికార్జునరావు
  • చంద్రబాబు ఈ నెల 29 నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వెల్లడి
  • ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని స్పష్టీకరణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. వాదనలు విన్న పిమ్మట ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 

ఇటీవల చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఆ బెయిల్ గడువు నాలుగు వారాలుగా న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని వివరించింది. 

చంద్రబాబు నవంబరు 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తన చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. 

కాగా, ఇవాళ తీర్పు సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఆధారాల్లేవని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలను పరిశీలించిన అనంతరం జస్టిస్ టి.మల్లికార్జునరావు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు.
Chandrababu
Bail
AP High Court
Skill Development Case
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News