Chandrababu: చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే క్రమంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court observations in Chandrababu bail plea hearing
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట
  • రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు
  • చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు అంగీకరిస్తున్నామన్న హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ సందర్భంగా హైకోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. 

చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబు ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఆయనకు ఈ దశలో బెయిల్ ఇవ్వరాదని కోర్టును కోరారు. సీఐడీ వాదనల పట్ల హైకోర్టు ధర్మాసనం స్పందించింది. 

నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని హైకోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు స్పందించారు. చంద్రబాబు పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్టు ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దాంతో హైకోర్టు కూడా చంద్రబాబు తరఫు న్యాయవాదులతో ఏకీభవించింది. 

టీడీపీ ఖాతాలోకి నిధులు మళ్లాయన్న ప్రాసిక్యూషన్ ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. తగిన ఆధారాలు లేకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయలేరని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు అంగీకరిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. 

ప్రతి సబ్ కాంట్రాక్టర్ తప్పులకు ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేయలేమని అన్నారు. ఉల్లంఘనలపై అధికారులు ముఖ్యమంత్రికి చెప్పినట్టు ఆధారాలు లేవని తెలిపారు. స్కిల్ వ్యవహారంలో దర్యాప్తు మొదలయ్యాక చంద్రబాబు 22 నెలలు బయటే ఉన్నారని ధర్మాసనం వెల్లడించింది. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం కూడా లేదు కదా అని వాఖ్యానించింది. 

చంద్రబాబుపై కొన్నిరోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వెల్లడించింది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్ జీ భద్రతలో ఉన్నారని, అలాంటి వ్యక్తి కేసు విచారణ నుంచి తప్పించుకుంటారా? అని ప్రశ్నించింది. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగిస్తారన్న వాదనలను తాము అంగీకరించబోమని హైకోర్టు స్పష్టం చేసింది.

సీమెన్స్ కంపెనీ డైరక్టర్, డిజైన్ టెక్ యజమాని వాట్సాప్ సందేశాలకు, చంద్రబాబుకు ఏమిటి సంబంధం? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సీఐడీ న్యాయవాది స్పందిస్తూ, సీమెన్స్ తో ఒప్పందంలో సుమన్ బోస్ పేరుతో సంతకం ఉందని వెల్లడించారు. అందుకు కోర్టు బదులిస్తూ... ఒప్పందాల్లో సంతకాలు పరిశీలించే బాధ్యత ముఖ్యమంత్రిది కాదని పేర్కొంది. సంతకాలపై అభ్యంతరాలు ఉంటే తేల్చడానికి ఫోరెన్సిక్ విభాగం ఉందని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పేందుకు ఆధారాలు లేవని హైకోర్టు వివరించింది.
Chandrababu
Bail
AP High Court
Skill Development Case
CID

More Telugu News