Nara Lokesh: చంద్రబాబు బెయిల్ తీర్పులోని హైలైట్స్ ను షేర్ చేసిన నారా లోకేశ్
- స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
- సత్యం గెలిచిందన్న నారా లోకేశ్
- అసత్యంపై యుద్ధం ఆరంభమైందని వెల్లడి
- తప్పుడు కుట్రలన్నీ న్యాయం ముందు బద్దలయ్యాయని వ్యాఖ్యలు
- బెయిల్ తీర్పు కాపీలోని కీలక అంశాలను ఎక్స్ లో పంచుకున్న లోకేశ్
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బెయిల్ తీర్పు ప్రతులలోని ముఖ్యాంశాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తీర్పు కాపీలోని కీలక అంశాలను హైలైట్ చేసి, వాటిని ఎక్స్ లో షేర్ చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ... సత్యం గెలిచిందని, అసత్యంపై యుద్ధం ఆరంభమైందని సమరశంఖం పూరించారు. మన నాయకుడు చంద్రబాబు కడిగిన ముత్యమే అని అభివర్ణించారు.
"సత్యమేవజయతే అని మరోసారి నిరూపితమైంది. ఆలస్యమైనా సత్యమే గెలిచింది. జగన్ కనుసన్నల్లోని వ్యవస్థల మేనేజ్ మెంటుపై సత్యం గెలిచింది. చంద్రబాబు గారి నీతి, నిజాయతీ, వ్యక్తిత్వం మరోసారి సమున్నతంగా తల ఎత్తుకుని నిలబడింది. నేను తప్పు చేయను, తప్పు చేయనివ్వను అని బాబు గారు ఎప్పుడూ చెప్పేదే మరోసారి నిజమైంది.
చంద్రబాబు గారిపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు... జగన్ కోసం జగన్ వ్యవస్థల ద్వారా బనాయించిందని బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. అరెస్టు చేసి 50 రోజులకి పైగా జైలులో పెట్టి కనీసం ఒక్క ఆధారమూ ఇప్పటికీ కోర్టు ముందు ఉంచలేకపోయిన తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయి. కేసులో ఆరోపించినట్టు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయింది.
తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూటకమని స్పష్టమైంది. చంద్రబాబుకి రూపాయి కూడా రాని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారనేది అవాస్తవమని న్యాయస్థానమే తేల్చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కీంని స్కాంగా మార్చేసి చంద్రబాబు గారి 45 ఏళ్ల క్లీన్ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి జగన్ అండ్ కో పన్నాగమని దేశమంతటికీ తెలిసింది. హైకోర్టు వ్యాఖ్యలతో కడిగిన ముత్యంలా మా బాబు గారు ఈ కుట్రకేసులన్నింటినీ జయిస్తారు" అంటూ లోకేశ్ పేర్కొన్నారు.