Payyavula Keshav: నరకాసుర వధ ప్రారంభమైంది... అందుకే ఈ సంబరాలు: సజ్జల వ్యాఖ్యలకు పయ్యావుల కౌంటర్
- చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
- మీడియా సమావేశంలో విమర్శలు చేసిన సజ్జల
- సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న పయ్యావుల
- ఆధారాలు చూపించలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా
చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ నేడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సీఐడీకి, వైసీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు తప్పుచేశాడని పదే పదే మీడియా ముందు చౌకబారు ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు అంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బెయిల్ లభించిన అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. పయ్యావుల తన నివాసం నుంచి జూమ్ ద్వారా మాట్లాడారు.
చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికే సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల చెప్పినట్టు మేం దీపావళి సంబరాలు చేసుకోవడం లేదు... నరకాసుర వధ ప్రారంభం కాబోతుందని సంబరాలు చేసుకోబోతున్నాం అని స్పష్టం చేశారు.
"ఆధారాలు మా వద్ద ఉన్నాయి... అవి కోర్టు ముందు పెట్టడం మరిచిపోయామని సజ్జల చెబుతాడా? సునీత రాసిన నోట్... దానికి సంబంధించిన ఫైల్ దొరకలేదని సజ్జల చెప్పడం పచ్చి అబద్ధం. ఫైల్ ప్రభుత్వం వద్దే ఉంది. కేవలం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పటికీ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది సాక్షుల్ని విచారించినా, ఇన్నివేల డాక్యుమెంట్స్ మీరు సేకరించినా, ప్రాథమికంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు నష్టం జరిగిందని చెప్పే ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు... నిర్ధారించలేకపోయారు అని కోర్టు చాలా స్పష్టంగా తీర్పులో అభిప్రాయపడింది” అని పయ్యావుల పేర్కొన్నారు.