Revanth Reddy: ఇరవై ఏళ్ల తర్వాత పీజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం వచ్చింది: రేవంత్ రెడ్డి
- ఖైరతాబాద్ అంటే గుర్తుకు వచ్చేది గణేశుడు... పీజేఆర్ అన్న రేవంత్ రెడ్డి
- పీజేఆర్ లేకపోయినా పేదల గుండెల్లో నిలిచారని వ్యాఖ్య
- నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్.. పీజేఆర్‌లా పని చేస్తాడని కితాబు
ఖైరతాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఒకటి గణేశుడు... రెండు పీజేఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. ఇరవై ఏళ్ల తర్వాత పీజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ వాసులకు వచ్చిందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విజయారెడ్డిని ఇక్కడి నుంచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయమ్మకు ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి వేసినట్లేనని చెప్పారు. పీజేఆర్ హయాంలోనే ఇక్కడ ఇళ్లు వచ్చాయి.. కరెంట్ వచ్చిందని గుర్తు చేశారు.
నాంపల్లిలో టీపీసీసీ చీఫ్ ప్రచారం
రేవంత్ రెడ్డి నాంపల్లిలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇరవై ఏళ్లుగా మజ్లిస్ పార్టీని గెలిపించి మోసపోయారని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. బోజగుట్ట శ్రీరామ్ నగర్, శివాజీనగర్ బస్తీ పేదలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శాస్త్రీపురం గుట్టపై కోట నిర్మించుకున్న మజ్లిస్ పార్టీ బోజగుట్ట పేదలకు డబుల్ బెడ్రూం ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. పీజేఆర్‌లా ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ మీ పక్షాన నిలబడతారన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాంపల్లిలో మజ్లిస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.