Hyderabad: హైదరాబాద్‌లో ప్రారంభమైన హోమ్ ఓటింగ్
- ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం
- హైదరాబాద్ జిల్లాలో 857 మందికి హోమ్ ఓటింగ్‌కు అవకాశం
- పోలింగ్‌కు మూడ్రోజుల ముందే ప్రక్రియ పూర్తి కావాలి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరంలో హోం ఓటింగ్ ప్రారంభమైంది. ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 857 మందికి ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం వచ్చింది. మొత్తం 966 మంది దరఖాస్తు చేసుకోగా 857 మందికి ఈసీ ఆమోదం తెలిపింది. రిటర్నింగ్ అధికారులు రెండు తేదీలను ఓటర్లకు సూచించాలి. మొదటి తేదీన ఓటు వేయడం కుదరకపోతే రెండో తేదీలో వేయవచ్చు. స్థానిక అధికారులు ఇంటి వద్దకు ఎన్నికల సామగ్రితో వెళ్లి ఓటు వేయించాలి. ఇంటి వద్ద సాధారణ పోలింగ్ కేంద్రం మాదిరి ఏర్పాటు చేస్తారు.
అధికారులు ఓటరు ఇంటికి వెళ్లి ఓ తాత్కాలిక గదిని ఏర్పాటు చేస్తారు. ఓటరు ఆ గదిలోకి వెళ్లి బ్యాలెట్ పేపర్ పైన తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ తర్వాత బ్యాలెట్ పేపరును చిన్న కవరు (ఫామ్ 13బీ)లో ఉంచి ఎన్నికల అధికారికి ఇవ్వాలి. ఓటు ధ్రువీకరణ పత్రం ఫామ్ 13ఏ పైన సంతకం చేయాలి. ఆ రెండు ఫామ్‌లను పెద్ద కవరులో వేసి, ఓటును సీల్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పోలింగ్‌కు మూడు రోజుల ముందు పూర్తి కావాలి.