Satya Nadella: వరల్డ్ కప్ ఫైనల్ నేపథ్యంలో సత్య నాదెళ్ల సరదా వ్యాఖ్యలు
- వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆసీస్
- ఓ పాడ్ కాస్ట్ లో తన అభిప్రాయాలు పంచుకున్న సత్య నాదెళ్ల
- ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొనేస్తారా? అంటూ ప్రశ్నించిన హోస్ట్
- ఆస్ట్రేలియాను కొనడం, ఓపెన్ఏఐని చేజిక్కించుకోవడం జరగని పని అంటూ సత్య వెల్లడి
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలవడం పట్ల స్పందించారు. ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై టీమిండియా ఆడిన సెమీస్ తో పాటు ఫైనల్ మ్యాచ్ ను కూడా వీక్షించానని చెప్పారు.
సత్య నాదెళ్ల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొనగా, "వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది కదా... అందుకు ప్రతీకారంగా ఆస్ట్రేలియానే కొనేస్తారా?" అంటూ హోస్ట్ సరదాగా ప్రశ్నించారు. అందుకు సత్య నాదెళ్ల కూడా అంతే సరదాగా బదులిచ్చారు. ఆస్ట్రేలియాను కొనేయడం అంటే ఓపెన్ ఏఐ సంస్థను కొనడం లాంటిదేనని, ఆ రెండు జరగని పని అని వ్యాఖ్యానించారు. అయితే, ఓపెన్ఏఐతో తాము భాగస్వాములం కాగలమని, ఆస్ట్రేలియా క్రికెట్ ఆడడాన్ని కూడా ఆస్వాదించగలమని చెప్పారు.
చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐలో మైక్రోసాప్ట్ అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతోంది. ఇటీవల ఓపెన్ఏఐ తన సీఈవో శామ్ ఆల్ట్ మన్ ను తొలగించగా, అతడికి మైక్రోసాఫ్ట్ సాదరంగా ఆహ్వానం పలికింది.