Atchannaidu: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఈసీకి చెప్పాం: అచ్చెన్నాయుడు
- ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ బృందం
- దొంగ ఓట్లను తొలగించాలని ఈసీని కోరామన్న అచ్చెన్నాయుడు
- ఈసీ నుంచి సానుకూల స్పందన వచ్చిందని వెల్లడి
టీడీపీ బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఏపీలో ఓటరు జాబితాలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఫిర్యాదు చేసింది. ఈసీని కలిసిన అనంతరం టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
పెద్ద సంఖ్యలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలని ఈసీని కోరామని చెప్పారు. దేశంలో ఏ ఎన్నికలకైనా టీచర్లను వినియోగిస్తున్నారని, ఏపీలో మాత్రం ఎన్నికలకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారని విమర్శించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ కనుసన్నల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుందని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఈసీకి చెప్పామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రాష్ట్రంలో ఓటర్ల పరిశీలన జరగలేదని, ఫారం 6, 7, 8 దరఖాస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వాలంటీర్ల ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 160 బూత్ లు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని వివరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న బూత్ లపై చర్యలు తీసుకోవాలని కోరామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
గ్రామ సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ప్రచారంలో పాల్గొంటున్నారని, బీఎల్వోలుగా గ్రామ సచివాలయ సిబ్బందినే నియమిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ జెండాలతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కారణాలతో, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఈసీని కోరామని చెప్పారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్పారని వివరించారు. త్వరలోనే విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారని వెల్లడించారు.