vivek: బాల్క సుమన్ ఫిర్యాదు చేయడం వల్లే ఐటీ దాడులు జరిగాయి: వివేక్
- ఎన్నికల్లో గెలవలేక తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం
- కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన కేసీఆర్పై దాడులు చేసే దమ్ములేదా? అని నిలదీత
- తెలంగాణలో కాంగ్రెస్ 80 సీట్లు గెలవబోతుందన్న వివేక్
చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఫిర్యాదు చేయడం వల్లే తనపై ఐటీ దాడులు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాలలోని ఆయన ఇంట్లో మంగళవారం నాడు ఐటీ దాడులు జరిగాయి.
ఈ నేపథ్యంలో వివేక్ మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలవలేకే తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన కేసీఆర్పై ఐటీ దాడులు జరిపే దమ్ములేదు కానీ తనపై దాడులు చేయించారని ధ్వజమెత్తారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తన మీద కుట్ర చేశాయన్నారు. తనపై ఎన్ని దాడులు చేసినా ఏం కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ 80 సీట్లు గెలవబోతుందన్నారు. చెన్నూరు నుంచి తాను గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి తన ఇంట్లో ఐటీ దాడులు చేశారన్నారు.