YS Sharmila: కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు... బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
- ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
- బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని విమర్శలు
- ఇక మీ ఆటలు సాగవని, ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్న షర్మిల
బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు ఐటీ దాడులే నిదర్శనమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ములేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐటీ దాడులకు పాల్పడుతున్నారన్నారు. గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై చేసే ఐటీ, ఈడీ దాడులకు ప్రధాని మోదీ కూడా కేసీఆర్ కు సాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒకే తానులోని ముక్కలని వ్యాఖ్యానించారు. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ నడుపుతున్నారని విమర్శించారు. తెరచాటు రాజకీయాలకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారన్నారు.
సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ మద్దతుదారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ప్రజలు హర్షించరని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదని, లిక్కర్ స్కాంలో కవితపై ఎలాంటి చర్యలు లేవని, భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులపై ఎలాంటి ఐటీ, ఈడీ సోదాలు జరగడం లేదని మండిపడ్డారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజాసేవ కోసం కానీ ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు కాదని సూచించారు. ఇక మీ ఆటలు మరెన్నో రోజులు సాగవని హెచ్చరించారు. కేసీఆర్, మోదీ పాలనలకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు.