Delhi High Court: ఖాళీగా కూర్చుని విడిపోయిన భర్తపై ఖర్చులను నెట్టేస్తారా?.. మనోవర్తి కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
- పెళ్లయ్యాక రెండేళ్లకే విడిపోయిన భర్త
- తొలుత నెలకు రూ. 21 వేలు, ఆపై రూ. 30 వేలు చెల్లించాలని భర్తను ఫ్యామిలీ కోర్టు ఆదేశం
- తనకొచ్చే రూ. 47 వేలలో రూ. 30 వేలు ఆమెకే ఇస్తే తన సంగతేంటని హైకోర్టును ఆశ్రయించిన భర్త
- సంపాదించే అవకాశం ఉండీ ఖర్చుల కోసం ఆధారపడడం సరికాదన్న న్యాయస్థానం
మనోవర్తి విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంపాదించే సామర్థ్యం ఉండి కూడా ఉద్యోగం వెతుక్కోకుండా తన ఖర్చులను విడిపోయిన భర్తపై మోపడం సరికాదని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2018లో పెళ్లి చేసుకున్న జంట మనస్పర్థల కారణంగా 2020లో విడిపోయింది. ఈ కేసులో భార్యకు నెలకు రూ. 21 వేల భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు విడిపోయిన భర్తను ఆదేశించింది. ఆ తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండానే దానిని రూ. 30 వేలకు పెంచింది. కోర్టు ఖర్చులు రూ. 51 వేలు చెల్లించాలని కూడా ఆదేశించింది.
తనకు వచ్చే వేతనంలో కోతలు పోను మిగిలేది రూ. 47 వేలు మాత్రమేనని, అందులో రూ. 30 వేలు మనోవర్తి కింద చెల్లిస్తే తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య ఓ ఆసుపత్రిలో పనిచేస్తూ నెలకు రూ. 25 వేలు సంపాదిస్తోందని కోర్టుకు తెలిపాడు. అయితే, తాను ఆసుపత్రి నుంచి ఎలాంటి వేతనం తీసుకోకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.
కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన ఆమె.. జీతం వచ్చే ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ అది మానేసి స్వచ్చందంగా పనిచేయడాన్ని తప్పుబట్టింది. సంపాదించే అవకాశం ఉండి కూడా వెతుక్కోకుండా ఖాళీగా కూర్చొని తన ఖర్చులను భర్తపై నెట్టడం సరికాదని తీర్పు చెప్పింది. ఇంట్లో ఖాళీగా కూర్చుని మనోవర్తి పేరిట భర్తపై భారం మోపడం సరికాదని తేల్చి చెప్పింది. హిందూ వివాహ చట్టంలోని 24, 25 సెక్షన్లు మనోవర్తి విషయంలో లింగభేదాన్ని పాటించవని, స్త్రీపురుషులకు అవి సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది. మనోవర్తిని రూ. 30 వేల నుంచి రూ. 21 వేలకు తగ్గించింది. అయితే, పెరిగే ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ భరణానికి ప్రతి ఏడాది అదనంగా రూ. 1500 కలిపి చెల్లించాలని ఆదేశించింది.