Three trains: ఒకే ట్రాక్ పై మూడు రైళ్లు.. రూర్కెలాలో ఘటన

Three Trains On One Track In Rourkela Major Train Accident Averted
  • ఎదురెదురుగా వచ్చిన రైళ్లు.. ఆ వెనకే వందేభారత్ కూడా
  • మెమూ రైలుకు ఎదురెళ్లిన ప్యాసింజర్ ట్రైన్
  • లోకోపైలట్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ఒడిశాలోని రూర్కెలాలో ఒకే ట్రాక్ పైకి మూడు రైళ్లు దూసుకొచ్చాయి. ఓ మెమూ రైలుకు ప్యాసింజర్ ట్రైన్ ఎదురెళ్లగా.. ఆ వెనకే వందేభారత్ ట్రైన్ దూసుకొచ్చింది. లోకోపైలట్లు అప్రమత్తం కావడంతో వంద మీటర్ల సమీపంలోకి వచ్చి రెండు రైళ్లు ఆగిపోయాయి. స్టేషన్ సిబ్బంది అలర్ట్ చేయడంతో సుమారు 200 మీటర్ల దూరంలో వందేభారత్ ట్రైన్ ఆగిపోయింది. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు వారు నిరాకరించారు.

సుందర్ గఢ్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సంబల్పూర్ - రూర్కెలా మధ్య నడిచే మెమూ రైలు, రూర్కెలా-జార్సుగూడ ప్యాసింజర్ ట్రైన్ ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చాయి. చివరి నిమిషంలో గమనించిన లోకోపైలట్లు వెంటనే బ్రేక్ వేశారు. దీంతో వంద మీటర్ల చేరువలోకి వచ్చాక రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రమాదం తప్పిందని భావించే లోపలే అదే ట్రాక్ పై పూరీ-రూర్కెలా వందేభారత్ దూసుకురావడం రైల్వే సిబ్బంది గమనించారు. వందేభారత్ లోకో పైలట్ కు సమాచారం అందించడంతో ఎమర్జెన్సీ బ్రేక్ అప్లయ్ చేసినట్లు సమాచారం. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగానే ఒకే ట్రాక్ పై మూడు రైళ్లు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం.
Three trains
One track
major accident
vandebharat
Rourkela
Odisha

More Telugu News