Vijayashanti: ఆ రెండు పార్టీలు తోడు దొంగలు: బీఆర్ఎస్, బీజేపీలపై విజయశాంతి విమర్శలు
- అందరికీ చుక్కలు చూపించే వరంగల్ వాసులను కేసీఆర్ మోసం చేశారని ధ్వజం
- ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడ్డారని విమర్శలు
- కేసీఆర్‌కు రాజకీయ పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉందన్న విజయశాంతి
మద్యం కేసులో వేరేవారిని అరెస్ట్ చేశారు కానీ... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయలేదని.. కేసీఆర్ కుటుంబం బరితెగించిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గురువారం వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ నియోజకవర్గం అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అందరికీ చుక్కలు చూపించే వరంగల్ వాసులను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. వరంగల్‌వాసులు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను గద్దె దించాల్సిందే అన్నారు.
ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చిందని, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు... కేసీఆర్‌కు డబ్బే ముఖ్యమని మండిపడ్డారు. భూ, మైనింగ్ మాఫియాను కేసీఆర్ ప్రోత్సహించారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతి చేశారన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు రాజకీయ పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల పేరిట, పేపర్ లీకేజీల పేరిట వేలాది కోట్లు తిన్నారని ఆరోపించారు. బీజేపీ కూడా కేసీఆర్‌ను గెలిపించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ పోరాటాల గడ్డ అని, ఇక్కడి నుంచి మార్పు చూడాలన్నారు.
కేసీఆర్ దోపిడీ, అరాచకాలను మార్చే శక్తి ప్రజల వద్ద ఉందన్నారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ వాళ్లు సామ దాన భేద, దండోపాయాలను ఉపయోగించి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అవినీతి కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా బీజేపీ కాపాడుతోందన్నారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలు అని మండిపడ్డారు.