Vivek Venkataswamy: అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు: వివేక్ వెంకటస్వామి
- రూ.200 కోట్ల లావాదేవీలు జరిపానంటూ ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- భూముల వ్యవహారంలో ఈటల రాజేందర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్న
- 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు ఆర్థిక సహాయం చేశానని ప్రస్తావన
- మంచిర్యాల జిల్లా భీమారం ఎన్నికల ప్రచారంలో వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక తనపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతుండడంపై చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘాటుగా స్పందించారు. కేసీఆర్, అమిత్ షా సారధ్యంలోనే తనపై ఈడీ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. బీజేపీలో ఉన్నప్పుడు సీతలా, కాంగ్రెస్‌లో చేరాక రావణుడిలా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని, అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి కేసులకు ఎవరూ భయపడొద్దని వివేక్ వెంకటస్వామి అన్నారు.
హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ భూములకు సంబంధించి ఆయనకు రూ.27 కోట్లు ఇచ్చానని, ఇందుకు సంబంధించిన లావాదేవీలు చట్టప్రకారం జరిగినా తనకు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. తన మిత్రుడు యశ్వంత్ రెడ్డికి చెందిన రూ.20 లక్షల విలువగల కంపెనీ రూ.200 కోట్ల లావాదేవీలు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. ఆ ఆరోపణలకు, తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. ఇటీవలే తన కంపెనీలో షేర్ల అమ్మకం ద్వారా రూ.50 కోట్ల లాభం వచ్చిందని, అందులో రూ.9 కోట్లు పన్నులుగా చెల్లించానని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు తాను ఆర్థిక సహాయం చేశానని, అలాంటి వ్యక్తి నేడు రూ.వేల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లిలో గురువారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.