WPL: డబ్ల్యూపీఎల్: మహిళా క్రికెటర్ల వేలానికి ముహూర్తం ఖరారు
- గత సీజన్ నుంచి భారత్ లో డబ్ల్యూపీఎల్
- తొలి సీజన్ విజేత ముంబయి ఇండియన్స్ మహిళల జట్టు
- డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ కు సన్నాహాలు
- డిసెంబరు 9న మహిళా క్రికెటర్ల వేలం
భారత్ లో గత సీజన్ నుంచి ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెటర్ల కోసం డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డబ్ల్యూపీఎల్-2023 సీజన్ లో ముంబయి ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఇప్పుడు రెండో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. డబ్ల్యూపీఎల్-2024 సీజన్ కోసం డిసెంబరు 9న మహిళా క్రికెటర్ల వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ వేలం ప్రక్రియ ముంబయిలో జరగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు డబ్ల్యూపీఎల్ వేలంలో పాల్గొననున్నాయి. ఈ జట్లు ఇప్పటికే 60 మంది మహిళా క్రికెటర్లను అట్టిపెట్టుకున్నాయి. వారిలో 21 మంది విదేశీ క్రికెటర్లు. అదే సమయంలో ఆయా జట్లు 29 మంది మహిళా క్రికెటర్లను విడుదల చేశాయి. విడుదలైన మహిళా క్రికెటర్లు వేలం ప్రక్రియలో అందుబాటులోకి రానున్నారు.
అత్యధికంగా గుజరాత్ జెయింట్స్ జట్టు సగం మంది మహిళా క్రికెటర్లను జట్టు నుంచి విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ వద్ద వేలంలో ఖర్చు చేసేందుకు రూ.5.95 కోట్లు ఉన్నాయి.