Vijay Varma: ఆ షాక్‌లో ఏడ్చుకుంటూ ఇంటికెళ్లా.. తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్‌ వర్మ

Actor vijay varma talks about his struggles as an actor
  • కెరీర్‌లో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి పంచుకున్న విజయ్ వర్మ
  • 2014లో ఓసారి డబ్బులు లేక చిన్న పాత్ర ఒప్పుకున్నట్టు చెప్పిన నటుడు
  • అది సరిగ్గా చేయలేక కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చిందని వెల్లడి
  • అప్పటి నుంచీ మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నట్టు చెప్పిన విజయ్ వర్మ
కెరీర్‌లో తాను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని ప్రముఖ నటుడు, తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మ తెలిపాడు. ఒకానొక సమయంలో తన బ్యాంక్ అకౌంట్లో రూ.18కి మించి లేవని చెప్పాడు.  ఓ దారుణ అనుభవం తరువాత డబ్బు గురించి ఆలోచించకుండా మంచి పాత్రల్లోనే నటించేందుకు నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. 

‘‘అప్పట్లో నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. నా బ్యాంకు అకౌంట్లో రూ.18 మాత్రమే ఉండేవి. ఆ టైంలో నాకు మంచి అవకాశాలు కూడా రాలేదు. కొందరు నన్ను రిపోర్టర్ పాత్రలో నటించమని కోరారు. ఒక్క రోజే షూటింగ్.. మూడు వేలు ఇస్తామన్నారు. అలాంటి పాత్రలు ఇష్టం లేకపోయినా డబ్బు కోసం ఓకే చెప్పాను. షూటింగ్ రోజున రిపోర్టింగ్ ఇంగ్లిష్‌లో చేయమన్నారు. అది అంత ఈజీగా లేకపోవడంతో సెట్‌లోనే నన్ను రిజెక్ట్ చేశారు’’ 

‘‘అప్పటికే నేను మాన్‌సూన్ షూట్ అవుట్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాను. అయినా సరే ఇలా చిన్నాచితకా పాత్రల్లో నటిస్తూ చివాట్లు తినాల్సిన దయనీయ పరిస్థితి ఎదుర్కొన్నాను. ఆ రోజు ఏడ్చుకుంటూ ఇంటికెళ్లాను. డబ్బు కోసం ఏది పడితే అది చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. 2014లో ఈ ఘటన జరగ్గా నాటి నుంచీ డబ్బుల ఆలోచన కట్టిపెట్టి నాకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నాను’’ అని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడు అప్ఘానీ స్నో, మర్డర్ ముబారక్, సూర్య 43వ చిత్రంలో నటిస్తున్నాడు.
Vijay Varma
Tamannaah
Bollywood
Tollywood

More Telugu News