YS Sharmila: సీఎంను కలవొద్దన్నప్పుడు జనం మీకు ఓటు వేయాల్సిన అవసరం ఏముంది?: కేటీఆర్‌కు షర్మిల ప్రశ్న
- ఓట్లు వేసి గెలిపించింది సేవ చేయడానికా? గడీల్లో భోగాలు అనుభవించడానికా? అని నిలదీత
- ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు.. దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు అని మండిపాటు
- ముమ్మాటికి వారు తెలంగాణ ద్రోహులేనని తీవ్ర విమర్శలు
- కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరన్న షర్మిల
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాల్సిన అవసరం ఏముందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని, అలాంటప్పుడు అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. శనివారం ఆమె ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా? లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా? అని నిలదీశారు. నాడు వైఎస్సార్ రచ్చబండలో ప్రజల నుంచి ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించి ప్రజాప్రభుత్వానికి చిరునామాగా నిలిచారన్నారు. క్యాంప్ ఆఫీస్‌లోనే ప్రజా దర్బార్ పెట్టి ప్రతి సమస్యను విన్నారన్నారు. కానీ నేడు కేసీఆర్ చేస్తోంది నియంత పాలన అని మండిపడ్డారు.
ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు.. దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు అని ఎద్దేవా చేశారు. అధికారం మత్తులో వారికి ప్రజాసమస్యలు కనిపించడం లేదన్నారు. ఇళ్లు లేక పేదలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా మీకు కనబడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి సమస్యలపై రైతుల గోడు వినిపించదు.. ఉద్యోగాలు కావాలని మొత్తుకుంటున్న నిరుద్యోగుల ఆకలి కేకలు మీ చెవిన పట్టవు.. సర్కారు బడిలో వసతులు లేక పేద బిడ్డలు పడుతున్న బాధలు మీకు కానరావంటూ చురకలు అంటించారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సమస్యల సుడిగుండంలో ముంచారన్నారు. మీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే.. ముమ్మాటికి మీరు తెలంగాణ ద్రోహులేనని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరన్నారు.