Narendra Modi: కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే ప్రారంభమైంది.. ఆ పార్టీకి ప్రాణమిత్రుడు: నరేంద్రమోదీ
- గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేసిన మోదీ
- కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్కు జిరాక్స్ అని వ్యాఖ్య
- ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలుస్తోందన్న మోదీ
కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణమిత్రుడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి ప్రారంభమైందని, అలాగే గతంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్కు జిరాక్స్ వంటిదేనని మోదీ ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. కానీ తాము బీసీని సీఎంగా చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
మాదిగ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలిచిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిన్న అధికారులతో భేటీ అయ్యానని, వర్గీకరణ రోడ్డు మ్యాప్ తయారు చేయాలని వారికి సూచించినట్లు చెప్పారు. బీజేపీ గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ తెలంగాణను అవినీతిలో నెంబర్ వన్‌గా నిలిపిందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని, అప్పుడు ధరలు తగ్గుతాయన్నారు.