North Korea: పేలిపోయిన ఉత్తర కొరియా రాకెట్... ప్రయోగం సక్సెస్ అంటూ పార్టీ ఇచ్చిన కిమ్
- సొంతంగా నిఘా ఉపగ్రహం కోసం ఉత్తర కొరియా ప్రయత్నాలు
- గతంలో రెండు రాకెట్ ప్రయోగాలు విఫలం
- మూడో ప్రయోగం సందేహాస్పదం
కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల స్థితిగతులతో సంబంధం లేకుండా ఆయుధ ప్రయోగాలు చేపడుతుండడం కొత్తేమీ కాదు. అయితే కొంతకాలంగా ఉత్తర కొరియా సొంతంగా నిఘా ఉపగ్రహం ఉండాలని కోరుకుంటోంది. అయితే ఈ దిశగా గతంలో రెండు రాకెట్ ప్రయోగాలు విఫలమయ్యాయి. కొన్నిరోజుల కిందట చేపట్టిన రాకెట్ ప్రయోగం కూడా సందేహాస్పదంగానే ఉంది.
ఈ రాకెట్ నింగికి ఎగిసిన తర్వాత పేలిపోయింది. అయితే ప్రయోగం సక్సెస్ అంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ శాస్త్రవేత్తలకు, కుటుంబ సభ్యులకు పార్టీ ఇచ్చారు. తమ రాకెట్ విజయవంతంగా గూఢచర్య ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిందని కిమ్ చెప్పుకొచ్చారు.
కాగా, ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి కీలక పరిణామాన్ని దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కెమెరా పసిగట్టింది. రాకెట్ పేలిపోవడాన్ని యోన్సీ వర్సిటీలోని అత్యాధునిక టెలిస్కోపిక్ కెమెరా గుర్తించినట్టు స్పేస్ డాట్ కామ్ తెలిపింది. గ్రహశకలాలను, ఉల్కలను, నక్షత్రాలను పరిశీలించేందుకు యోన్సీ విద్యాలయంలో ఈ కెమెరా ఏర్పాటు చేశారు.
ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాక ఉద్దేశపూర్వకంగానే రాకెట్ మొదటి దశ ప్రొపెల్లెంట్ ను ఉత్తర కొరియా పేల్చివేసి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాకెట్ భూమిపై పడితే దక్షిణ కొరియా, అమెరికా వర్గాలు దాన్ని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకే ఉత్తర కొరియా విస్ఫోటనానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.
ఏదేమైనా ఈ ప్రయోగంపై ఇప్పుడప్పుడే వ్యాఖ్యానించలేమని పొరుగునే ఉన్న దక్షిణ కొరియా చెబుతోంది.