Voter slip: ఓటర్ స్లిప్ అందలేదా.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
- ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- రాష్ట్రంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి: ఈసీ
- అనివార్య కారణాలతో కొంతమందికి అందని స్లిప్పులు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా ఈ నెల 25 (శనివారం) తో పూర్తయిందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. తమ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ స్లిప్పులు అందజేశారని పేర్కొంది. ఇంకా కొంతమందికి అనివార్య కారణాలతో స్లిప్పులు అందించలేకపోయినట్లు తెలిపింది. అయితే, ఓటర్ స్లిప్పులు అందని వారికి మరో అవకాశం ఉందని చెప్పింది. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటర్ స్లిప్పులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
ఓటర్ స్లిప్ ఎందుకంటే..
ఓటు హక్కు ఉందా లేదా అనే ప్రాథమిక విషయంతో పాటు ఏ పోలింగ్ బూత్ లో ఓటేయాలనే వివరాలు ఈ స్లిప్పులోనే ఉంటాయి. ఈ స్లిప్ తో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డును తీసుకెళ్లి ఓటేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓటర్ స్లిప్ అందని వారు నేరుగా ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది.
ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..
తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అవసరమైన సమాచారం ఫీడ్ చేస్తే ఓటరు వివరాలు, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం, పోలింగ్ సమయం, పోలింగ్ స్టేషన్ నంబర్ తదితర వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఓటరు నమోదు సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ సాయంతో స్లిప్పును పొందొచ్చు. ఈ స్లిప్‌ను ప్రింట్ తీసుకుని పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేయవచ్చు. దీంతో పాటు ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌లోనూ ఓటర్ స్లిప్ పొందొచ్చు.