Ravichandran Ashwin: అదే జరిగితే అది డబ్బు కోసమే తప్ప మరోటి కాదు.. పాండ్యా గుజరాత్‌ను వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
- గుజరాత్ టైటాన్స్‌కు పాండ్యా గుడ్‌బై చెబుతున్నట్టు వార్తలు
- భారీ మొత్తంతో హార్దిక్‌ను సొంతం చేసుకోబోతున్నట్టు న్యూస్
- తనకు తెలిసింత వరకు అలా జరగకపోవచ్చన్న అశ్విన్
- ఒకవేళ జరిగితే ట్రేడ్‌కు కెప్టెన్ వెళ్లడం ఐపీఎల్ చరిత్రలోనే మూడోసారి
- పాండ్యా వెళ్తే ఎంఐ జట్టు కూర్పు ఎలా ఉంటుందో కూడా చెప్పిన వెటరన్ స్పిన్నర్
- వైరల్ వార్తలపై స్పందించని ముంబై, గుజరాత్ ఫ్రాంచైజీలు
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించి ట్రోఫీ అందించి పెట్టిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు మారబోతున్నాడన్న వార్తలపై వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఈ వార్తలు కనుక నిజమైతే ముంబై ఇండియన్స్ గోల్డ్ సాధించినట్టేనని పేర్కొన్నాడు. తాను చదివింది నిజమైతే అది పూర్తిగా డబ్బుల కోసం జరిగిన ఒప్పందమే తప్ప మరోటి కాదని అభిప్రాయపడ్డాడు.
ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ఏ ఆటగాడిని వదులుకోలేదని, ఎప్పుడూ ఆటగాడిని ట్రేడ్‌కు ఇవ్వలేదని గుర్తు చేశాడు. ఇలా జరుగుతుందని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పాడు. అయితే, హార్దిక్ ముంబై వెళ్తే ఆ జట్టు కూర్పు ఎలా ఉంటుందో చూడాల్సిందేనని ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, హార్దిక్ వెళ్తే ముంబై జట్టు ఎలా ఉంటుందో కూడా అంచనా వేశాడు.
రోహిత్‌శర్మ, ఇషాన్ కిషన్, తిలక్‌వర్మ, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జోఫ్రా అర్చర్/రైల్ మెరిడిత్/జాసన్ బెహ్రాండార్ఫ్/మిచెల్ స్టార్క్/పాట్ కమిన్స్‌గా జట్టును కూర్చాడు.
ఐపీఎల్ చరిత్రలో ఓ కెప్టెన్‌ను ట్రేడ్‌కు ఇవ్వడం ఇది మూడోసారి అవుతుందని కూడా అశ్విన్ పేర్కొన్నాడు. అందులో మొదటిది తానేనని పేర్కొన్నాడు. రెండోవాడు అజింక్య రహానే అని, మూడోవాడు పాండ్యా అవుతాడని వివరించాడు. పాండ్యాను ముంబై దక్కించుకోబోతోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఇటు ముంబై ఇండియన్స్ కానీ, అటు గుజరాత్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి