Amit Shah: ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవి: అమిత్ షా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణ
- ప్రజాప్రతినిధులు ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే పార్టీ విధానంగా మారిందని విమర్శలు
- కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే సమయం వచ్చిందని వ్యాఖ్య
ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిమయమైందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే ఆ పార్టీ ఎమ్మెల్యేల విధానంగా మారిందని మండిపడ్డారు.
బీజేపీ గెలిస్తే మక్తల్, నారాయణపేటలలో టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్‌కు వేసినట్లే అవుతుందని, వారు కేసీఆర్‌కు అమ్ముడుపోతారని ఆరోపించారు.