Nara Lokesh: నారా లోకేశ్ మళ్లీ వస్తున్నాడు... రేపే యువగళం పునఃప్రారంభం
- స్కిల్ కేసులో చంద్రబాబు విడుదల
- టీడీపీ కార్యకలాపాల్లో జోరు
- ఈ నెల 27న రాజోలు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- పాదయాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధం
అధినేత చంద్రబాబునాయుడు జైలు నుంచి విడుదల కావడంతో టీడీపీ తన కార్యకలాపాలు ముమ్మరం చేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు.
స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత యువగళం నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో యువగళం పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రేపు (నవంబరు 27) కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేపట్టనున్నారు. తద్వారా మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. యువగళం పాదయాత్ర మళ్లీ మొదలవుతోందన్న వార్తతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
లోకేశ్ యువగళం పాదయాత్ర జనవరి 27న కుప్పంలో ప్రారంభమైంది. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ సంకల్పించారు. ఇప్పటివరకు లోకేశ్ 209 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 2852.4 కి.మీ. దూరం నడిచారు.
210వ రోజు (27-11-2023) యువగళం వివరాలు
రాజోలు/పి.గన్నవరం/అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా)
ఉదయం
10.19 – రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
11.20 – తాటిపాక సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
మధ్యాహ్నం
12.35 – పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం, నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి.
2.00 – మామిడికుదురులో స్థానికులతో సమావేశం.
2.45 – పాశర్లపూడిలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – అప్పనపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం.
5.30 – అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ.
6.30 – బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి.
7.30 – పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీ.
7.45 – పేరూరు శివారు విడిది కేంద్రంలో బస.