Jagga Reddy: 'సంగారెడ్డి పులి' అంటూ జగ్గారెడ్డి భుజంపై చేయివేసి మెచ్చుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi praises Jagga Reddy in Sangareddy meeting

  • రాహుల్ గాంధీ సంగారెడ్డి సభలో ఆసక్తికర పరిణామాలు
  • ఇందిరాగాంధీపై పాట పాడిన వృద్ధురాలు.. హిందీలో రాహుల్‍కు అర్థమయ్యేలా వివరించిన జగ్గారెడ్డి
  • పెద్దపులి అంటూ జగ్గారెడ్డికి కితాబు.. జోడో యాత్రలో కష్టపడి పని చేశారని వ్యాఖ్య
  • 1980లలో ఇందిరా గాంధీ ఇదే వేదిక మీద మాట్లాడినట్లు గుర్తు చేసిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంగారెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వేదికపై ఓ వృద్ధురాలు ఇందిరమ్మపై పాట పాడారు. ఇందిరాగాంధీ... ఇల్లు, భూమి ఇవ్వడంతో పాటు ఎంతో చేశారంటూ, నాడు ఇందిర ఇచ్చిన పథకాలను పాట రూపంలో వినిపించారు. ఆ వృద్ధురాలు తెలుగులో పాడారు. దీంతో జగ్గారెడ్డి ఆమె ఏం పాడారో హిందీలో వివరించారు.

రాహుల్ గాంధీ తన ప్రసంగం చివరలో జగ్గారెడ్డిని దగ్గరకు తీసుకొని భుజంపై చేయి వేసి మెచ్చుకున్నారు. అంతకుముందు ప్రసంగం సందర్భంగా మాట్లాడుతూ... జగ్గారెడ్డి పెద్దపులి అని ప్రశంసించారు. ఆయన కష్టపడి పని చేస్తారని, భారత్ జోడో యాత్రలో ఆయన ఎలా కష్టపడి పని చేయడం చూశానన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం పూర్తైన తర్వాత జగ్గారెడ్డి ఆయనకు మరో ఆసక్తికర విషయం చెప్పారు. ఇదే మైదానంలో 1980లలో మీ నానమ్మ ఇందిరాగాంధీ కూడా ప్రసంగించారని తెలిపారు. రాహుల్ గాంధీ వెళుతున్న సమయంలో జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యులను, ఇతరులను పరిచయం చేశారు. తనకు రాహుల్ గాంధీ ప్రేమ తప్ప ఏదీ అవసరం లేదన్నారు.

కేసీఆర్‌పై కేసు పెట్టలేదు

సంగారెడ్డి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తాను ప్రధాని మోదీపై పోరాటం చేస్తున్నానని, తనపై 24 కేసులు పెట్టారని, 60 గంటల పాటు ఈడీ తనను విచారించిందని గుర్తు చేశారు. తన అధికారిక కార్యాలయాన్ని కూడా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రతి బీదవాడి గుండెల్లో నేను ఉన్నాను... కాబట్టి ఆ ఇల్లు నాకు అవసరం లేదని చెప్పానన్నారు. 

అదే సమయంలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఒక్క కేసు పెట్టలేదన్నారు. వారిద్దరు కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్... వీరిద్దరి లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడించడమేనని మండిపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే చోట్ల మజ్లిస్ పార్టీ పోటీ చేసి బీజేపీకి లబ్ది చేకూరుస్తుందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News