CPI Narayana: కేసీఆర్... నిరాహార దీక్ష సమయంలో నువ్వు జ్యూస్ తాగిన విషయం మరిచిపోయావా?: సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

CPI Narayana interesting comments on KCR deeksha
  • డాక్టర్ గోపినాథ్‌ను అడిగితే కేసీఆర్ ఎంత నిబద్ధతతో దీక్ష చేశారో తెలుస్తుందన్న నారాయణ
  • కేసీఆర్ జ్యూస్ తాగితే ఓయూ విద్యార్థులు ఆగ్రహించడంతో మళ్లీ మాట మార్చారన్న నారాయణ
  • ఐటీ దాడుల తీరు చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలుస్తోందని వ్యాఖ్య
చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని చెబుతున్న కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం నాడు కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చావునోట్లో తలపెటట్టి తెలంగాణ తెచ్చానని చెబుతున్నారని, కానీ ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ గోపినాథ్‌ను అడిగితే కేసీఆర్ ఎంత నిబద్ధతతో దీక్ష చేశారో తెలుస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు.

డాక్టర్ గోపినాథ్ ఈ దీక్షకు సంబంధించిన పూర్తి నివేదికను తమకు అందించారన్నారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని జ్యూస్ తాగిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహిస్తే మాట మార్చిన విషయం కేసీఆర్ మరిచిపోతే ఎలా? అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల అంశంపై కూడా నారాయణ స్పందించారు. వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారా? కాంగ్రెస్ పార్టీలోకి రాగానే అవినీతిపరుడు అయ్యాడా? అని ప్రశ్నించారు. ఐటీ దాడుల తీరు చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ తెలిసిపోతుందన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయలేదని విమర్శించారు. అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రైతుబంధుకు ఎలా అనుమతించారు? అని నిలదీశారు.
CPI Narayana
Telangana Assembly Election
Congress
BJP
BRS

More Telugu News