Air India: విమానం టేకాఫ్ సమయంలో శబ్దం.. వెనుదిరిగి ఖాట్మండులోనే ల్యాండ్ అయిన ఎయిరిండియా ఫ్లైట్
- శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన
- ముందు జాగ్రత్త చర్యగా విమానం వెనక్కి మళ్లింపు
- ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించిన అధికారులు
శనివారం సాయంత్రం నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిరిండియా విమానాన్ని టేకాఫ్ తీసుకున్న తర్వాత, తిరిగి అదే ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టేకాఫ్ సమయంలో విమానంలో శబ్దం వినిపించడంతో పైలెట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా విమానం ఏ321 తిరిగి ఖాట్మండు వచ్చిందని అధికారులు ప్రకటించారు. టేకాఫ్ సమయంలో శబ్దం రావడమే ఇందుకు కారణమని ఆదివారం ప్రకటించారు.
టేకాఫ్‌కు ముందు విమానంలోని డోర్ పనికిరాదని గమనించామని, అయితే అవసరమైన భద్రత ప్రోటోకాల్‌ను అనుసరించి విమానం టేకాఫ్ కోసం క్లియరెన్స్ ఇచ్చారని అధికారులు వివరించారు. విమానం తిరిగి ఖాట్మండులోనే ల్యాండవ్వడానికి ఈ అంశాలకు సంబంధంలేదని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేదని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. విమానం తోక భాగంలో ఏమైనా సమస్య ఉందేమోనని పైలెట్లు అనుమానించారని, ల్యాండింగ్ తర్వాత ఎలాంటి సమస్య లేదని నిర్ధారించామని ఓ అధికారి వెల్లడించారు. శబ్దం వినిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా తిరిగి ఖాట్మండు విమానాశ్రయానికి వెళ్లాలని పైలెట్ నిర్ణయించుకున్నాడని వివరించారు.